TDP: ఢిల్లీలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు
- వెలిగొండపై తెలంగాణ అభ్యంతరాలు
- ఇప్పటికే కేఆర్ఎంబీకి ఫిర్యాదు
- వెలిగొండను గెజిట్ లో చేర్చాలన్న టీడీపీ నేతలు
- ప్రాజెక్టు ఆవశ్యకత కేంద్రమంత్రికి నివేదన
వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాలను ఆయనకు వివరించారు.
క్షామ పీడిత ప్రకాశం జిల్లా రైతాంగానికి వెలిగొండ ప్రాజెక్టు అత్యావశ్యకమని వారు స్పష్టం చేశారు. తక్షణమే వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్ లో చేర్చాలని కోరారు. ఇటీవల కేంద్రం తమ గెజిట్ నోటిఫికేషన్ లో వెలిగొండను చేర్చకపోవడంతోనే తెలంగాణ బలంగా వాదనలు వినిపిస్తోందని వారు వివరించారు.
కేంద్రమంత్రిని కలిసిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ తో పాటు దామచర్ల జనార్దన్, ఉగ్రనరసింహారెడ్డి తదితర నేతలు ఉన్నారు.