Jagan: పులివెందుల కానీ, విజయవాడ కానీ.. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని: మంత్రి మేకపాటి
- సీఎం నివాసం ఉన్న చోటే రాజధాని
- శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే మూడు రాజధానుల నిర్ణయం
- జగన్ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉన్నాం
ఇప్పటికే ఏపీ రాజధాని అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతిని శాసన రాజధాని, కర్నూలును న్యాయ రాజధాని, వైజాగ్ ను పాలన రాజధానిగా చేస్తామని నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. అలాగే, మూడు రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టులో ఉంది.
మరోవైపు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పారు. అది పులివెందుల అయినా, విజయవాడ అయినా సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని అన్నారు. సీఎం నివాసం ఎక్కడుంటే అక్కడే రాజధాని, అక్కడే సెక్రటేరియట్ అని చెప్పారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారని అన్నారు. జగన్ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని చెప్పారు.