Buggana Rajendranath: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కలిసిన బుగ్గన
- ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ఆర్థిక మంత్రుల మధ్య చర్చ
- అన్‌రాక్ అల్యూమినియం కంపెనీ వివాదంపై వివరణ
- కేంద్ర సంస్థల ఏర్పాటుకు భూకేటాయింపు
- పోలవరం నిధుల అంశం ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఢిల్లీ పర్యటనలో వున్నారు. ఈ క్రమంలో ఆయన నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం అనంతరం మీడియాతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. అన్‌రాక్ అల్యూమినియం కంపెనీ వివాదంలో పరిష్కారం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ కంపెనీకి సంబంధించిన ఆర్బిట్రేషన్ కేసుపై నిర్మల సీతారామన్‌తో చర్చించినట్లు తెలిపారు. ఈ సంస్థకు అవసరమైన బాక్సైట్‌ను ఏపీ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయడానికి యత్నిస్తున్నట్లు వివరించారు.
ఈ కేసులో చట్టపరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతే ఒక పెద్ద కంపెనీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందని బుగ్గన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో భూకేటాయింపులపై కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సంస్థల స్థాపనకు అవసరమైన భూములను ఏపీ ప్రభుత్వం కేటాయించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ విద్యా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు బుగ్గన పేర్కొన్నారు. పోలవరం నిధుల గురించి కూడా నిర్మలతో సమావేశంలో ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన బుగ్గన.. పోలవరం నిధుల విడుదల ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు తెలియజేశారు.