Thief: మీ టెక్నాలజీ కంటే ఐదేళ్లు ముందున్నా... నన్ను పట్టుకోలేరు: హైదరాబాద్ పోలీసులకు సవాల్ విసిరిన దొంగ
- కార్ల చోరీలు చేస్తున్న రాజస్థాన్ వాసి
- ఎంబీయే చదివిన సత్యేంద్రసింగ్ షెకావత్
- ఓసారి అరెస్ట్ అయి విడుదల
- ఆ తర్వాత టెక్నాలజీపై పట్టు సాధించిన వైనం
అతడి పేరు సత్యేంద్ర సింగ్ షెకావత్. చదివింది ఎంబీయే. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన సత్యేంద్రసింగ్ ఓ కార్ల దొంగ. ఇప్పటివరకు 60 వరకు కార్లను ఎత్తుకెళ్లాడు. కొన్నాళ్ల కిందట కార్ల చోరీ కేసుల్లో ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర పోలీసులకు పట్టుబడ్డాడు. విడుదలైన అనంతరం సత్యేంద్రసింగ్ టెక్నాలజీని వంటబట్టించుకున్నాడు. స్కానింగ్ డివైస్ లు, ఎలక్ట్రానిక్ కీ కట్టర్ ల సాయంతో తెలివిగా కార్లను తస్కరించడం ప్రారంభించాడు. కారును తస్కరించగానే అందులోని జీపీఎస్ లింకును కత్తిరించేవాడు. దాంతో ఆ కారును ట్రాక్ చేయడం సాధ్యం కాదు.
సత్యేంద్రసింగ్ కోసం తీవ్రంగా వెదుకుతున్న వారిలో హైదరాబాద్ పోలీసులు కూడా ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. గతేడాది బంజారాహిల్స్ లో కన్నడ సినీ నిర్మాత మంజునాథ్ కు చెందిన వాహనాన్ని కూడా సత్యేంద్రసింగ్ దొంగిలించాడు. ఎలాగోలా కొన్ని ఆధారాలు సంపాదించిన పోలీసులు దొంగ రాజస్థాన్ కు చెందినవాడని గుర్తించి జైపూర్ లోని అతడి నివాసానికి వెళ్లారు.
సత్యేంద్రసింగ్ ఆ సమయంలో ఇంట్లో లేడు. అయితే పోలీసులకు వాట్సాప్ ద్వారా కాల్ చేసిన ఆ దొంగ, తన చిరునామా కనుగొని వచ్చినందుకు అభినందనలు తెలిపాడు. నన్ను పట్టుకోవడం మీ తరం కాదు అంటూ సవాల్ విసిరిన అతడు... నా కోసం చాలా దూరం వచ్చారు, జైపూర్ లో మంచి భోజన హోటల్ ఉంది, అక్కడ భోంచేసి వెళ్లండి. ఒకవేళ మీరు మా ఇంట్లో ఓ గంటసేపు ఉంటే నా భార్య రుచికరంగా వండిపెడుతుంది అంటూ పోలీసులకు సూచించాడు.
ఈ ఘటన తర్వాత కూడా సత్యేంద్రసింగ్ షెకావత్ చోరీలు ఆగలేదు. హైదరాబాదులోనే పలు కార్లు తస్కరించాడు. దాంతో పోలీసులు మరోసారి జైపూర్ వెళ్లగా, వారి రాకను గుర్తించిన సత్యేంద్రసింగ్ ఫోన్ చేసి.... నమస్తే సార్, మీరు జైపూర్ వచ్చారా? నేనిప్పుడు బెంగళూరులో ఉన్నాను అంటూ వారిని కవ్వించే ప్రయత్నం చేశాడు. టెక్నాలజీ విషయంలో నేను మీకంటే ఐదేళ్లు ముందున్నా... నన్ను పట్టుకోవడం మీకు సాధ్యంకాని పని అంటూ పోలీసులకు స్పష్టం చేశాడు. కాగా, ఈ కేసులకు సంబంధించి అతడి భార్యను ఓసారి అరెస్ట్ చేసినా ఆమె బెయిల్ పై విడుదలైంది.