Taliban: కాబూల్ ఎయిర్‌పోర్టులో దర్జాగా తాలిబన్లు.. ఫొటోలకు పోజులు
- ఆఫ్ఘనిస్థాన్ వీడిన విదేశీ మిలటరీ దళాలు
- ఇక్కడే 73 ఎయిర్‌క్రాఫ్ట్‌లు వదిలేసిన యూఎస్
- పనిచేయకుండా వాటిని నాశనం చేసిన అమెరికన్ ఆర్మీ
- ఫొటోలు దిగిన తాలిబన్ల ‘బద్రి 313’ స్పెషల్ ఫోర్స్ టీం
చివరకు ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల వశమైంది. ఇన్నిరోజులుగా ప్రజలను విదేశాలకు చేరవేయడంలో ఏకైక మార్గంగా ఉపయోగపడిన కాబూల్‌లోని హమీద్ కర్జాయి విమానాశ్రయం కూడా తాలిబన్ల హస్తగతమైంది. ఒప్పందం ప్రకారం మంగళవారం నాడు అమెరికాకు చెందిన మిగతా దళాలు కూడా ఆఫ్ఘనిస్థాన్‌ను వీడి వెళ్లిపోయాయి.
దీంతో కాబూల్ ఎయిర్‌పోర్టులోకి తాలిబన్లు దర్జాగా ఎంటరయ్యారు. విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులన్నింటినీ ఖాళీ చేసిన తాలిబన్లు.. ఎయిర్‌పోర్టులో అమెరికా వదిలి వెళ్లిన విమానాలు, హెలికాప్టర్లను పరిశీలించారు. ఈ సమయంలో తాలిబన్లకు చెందిన ‘బద్రి 313’ స్పెషల్ ఫోర్స్ టీం ఫొటోలకు పోజులిచ్చింది.
తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఒక బృందాన్ని తీసుకొని రన్‌వేపై నడిచారు. ఆ సమయంలో ఆయన ఆనందంతో నవ్వుతూ కనిపించారు. ఇక్కడ 73 ఎయిర్‌క్రాఫ్ట్‌లను వదిలి వెళ్లినట్లు అమెరికా మిలటరీ తెలిపింది. వీటిని పనిచేయకుండా చేసినట్లు వెల్లడించింది. వీటి కాక్‌పిట్ విండోలు బద్దలు కొట్టి, టైర్లు పేల్చేసినట్లు కనిపిస్తోంది. కాబూల్ ఎయిర్‌పోర్టులో సహాయక కార్యక్రమాల కోసం అమెరికా 6 వేల మంది సైనికులను ఉపయోగించినట్లు సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ కెన్నెత్ మెకెంజీ తెలిపారు.
ఇక్కడ వదిలేసిన విమానాల్లో 70 ఎంఆర్ఏపీ ఆర్మర్డ్ టాక్టికల్ వాహనాలని, ఇవి ఒక్కోటి మిలియన్ డాలర్ల విలువ చేస్తాయని ఆయన చెప్పారు. ఇవికాక 27 హంవీలను కూడా వదిలేసినట్లు తెలిపారు. వీటితోపాటు సీ-ఆర్ఏఎం వ్యవస్థను కూడా అమెరికా ఇక్కడ వదిలేసింది. ఇది రాకెట్లు, ఆర్టిలరీ, మోర్టార్ ఆయుధాల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థ. దీని సాయంతోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాజాగా ప్రయోగించిన 5 రాకెట్లను యూఎస్ అడ్డుకోగలిగింది.