America: అమెరికాను వణికిస్తున్న ‘డెల్టా’.. ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న అగ్రరాజ్యం

America suffers with Oxygen Scarcity

  • కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు
  • రిజర్వు చేసిన ఆక్సిజన్‌నూ వాడేస్తున్న వైనం
  • చిన్నారుల్లోనూ మరణాలు సాధారణం కావొచ్చని ఆందోళన

మన దేశంలో కరోనా వైరస్ రెండో ఉద్ధృతికి కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య మళ్లీ అక్కడ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఫలితంగా ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఫ్లోరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆసుపత్రులు ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్నాయి.

ఈ క్రమంలో చాలా చోట్ల రిజర్వు చేసిన ఆక్సిజన్‌ను కూడా వాడుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వైద్యులు పేర్కొన్నారు. సాధారణంగా 90 శాతం నిండి ఉండే ఆక్సిజన్ ట్యాంకులో 30-40 శాతం మిగిలి ఉండే వరకు ఆక్సిజన్‌ ను వాడతారు. అలా మిగల్చడం వల్ల మరో ఐదు రోజుల వరకు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు 10 శాతం స్థాయి వరకు వాడేయాల్సి వస్తోందని చెబుతున్నారు. దీని వల్ల ఒకటి రెండు రోజులకు మించి ఆక్సిజన్ నిల్వలు ఉండవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీనికితోడు హరికేన్ల కారణంగా గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఇది వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోందని లూసియానా గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల లోపు వారికి టీకాలు అందుబాటులో లేకపోవడం, త్వరలోనే స్కూళ్లు తెరవనుండడంతో వారు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారినపడే అవకాశం ఉందని, వారితో ఆసుపత్రులు నిండిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక చిన్నారుల్లోనూ మరణాలు సర్వసాధారణం అయిపోవచ్చని ఆందోళన చెందుతున్నారు. డిసెంబరు నాటికి దేశంలో కొత్తగా లక్ష మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ పేర్కొనడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

  • Loading...

More Telugu News