Andhra Pradesh: అమరావతి అసైన్డ్ భూముల జీవో 316పై తదుపరి చర్యలను నిలిపివేసిన హైకోర్టు
- రైతులకు ఇచ్చిన భూములు తిరిగి తీసుకుంటూ సర్కార్ జీవో
- ఆ జీవోను కోర్టులో సవాల్ చేసిన రైతులు
- నేడు హైకోర్టులో విచారణ.. మధ్యంతర ఉత్తర్వులు
రాజధాని భూముల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములు తీసుకున్న రైతులకు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. వారికి నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ భూములను తిరిగి తీసుకుంటూ ఇప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 316 జీవోపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆ జీవోకు సంబంధించి తదుపరి చర్యలను తీసుకోరాదంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు ప్యాకేజీ ఇస్తూ గత ప్రభుత్వం జీవో 41ని తీసుకొచ్చిందని, కానీ, ఇప్పుడు దానిని రద్దు చేసి రైతులకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటున్నారని కోర్టుకు రైతుల తరఫు న్యాయవాది వివరించారు. అయితే, వారి వాదనలను తోసిపుచ్చిన ప్రభుత్వ తరఫు లాయర్.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ కోర్టును కోరారు. అయినా, తదుపరి చర్యలను నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.