WMO: గత 50 ఏళ్లలో ప్రకృతి విపత్తుల నష్టం.. 20 లక్షల ప్రాణాలు, 3.64 లక్షల కోట్ల డాలర్ల ఆస్తులు!
- డబ్ల్యూఎంవో విశ్లేషణలో వెల్లడి
- 1970 నుంచి సంభవించిన 11 వేల విపత్తుల విశ్లేషణ
- ఒక్క ఇథియోపియా కరవుతోనే 3 లక్షల మంది మృతి
వరదలు కావొచ్చు.. వడదెబ్బ అయి ఉండొచ్చు.. కరవు పరిస్థితులు కావొచ్చు.. ఈ 50 ఏళ్లలో 20 లక్షల మందికిపైగా మరణించారు. అంతేకాదు.. ఆస్తి నష్టాలూ భారీగా పెరిగాయి. 1970 నుంచి 2019 దాకా జరిగిన ప్రకృతి ఉత్పాతాలపై ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) విశ్లేషణ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. 1983లో ఇథియోపియా కరవు సహా అన్ని విపత్తులను విశ్లేషించింది.
ఒక్క ఇథియోపియా కరవు వల్లే 3 లక్షల మంది చనిపోయినట్టు పేర్కొంది. ఈ 50 ఏళ్లలో విపత్తుల వల్ల 3.64 లక్షల కోట్ల డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్టు పేర్కొంది. 2005లో అమెరికాను ముంచెత్తిన కత్రినా తుపాను వల్ల అత్యధికంగా 16,361 కోట్ల డాలర్ల నష్టం జరిగినట్టు చెప్పింది. వీటన్నింటికీ కారణం భూతాపమేనని ఆందోళన వ్యక్తం చేసింది. విపత్తులు పెరిగే కొద్దీ ఆర్థిక నష్టాలూ భారీగా పెరిగాయని తెలిపింది.
అయితే, ప్రకృతి విపత్తుల వల్ల ఏటా చనిపోయే వారి సంఖ్య మాత్రం తగ్గినట్టు డబ్ల్యూఎంవో పేర్కొంది. 1970ల్లో ఏటా 50 వేల మంది చనిపోగా.. 2010 నుంచి ఈ పదేళ్లలో ఏటా సగటున 18 వేల మంది దాకా మరణించినట్టు తెలిపింది. మొత్తం మరణాల్లో 91 శాతం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నమోదయ్యాయని చెప్పింది. డబ్ల్యూఎంవోలోని 193 సభ్య దేశాల్లో కేవలం సగం దేశాల్లోనే విపత్తు హెచ్చరికల వ్యవస్థలున్నాయని చెప్పింది.