Sajjala Ramakrishna Reddy: పవన్ కల్యాణ్ ఎక్కడో ఉంటూ ఇక్కడి రోడ్ల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది: సజ్జల

Sajjala counter Pawan Kalyan remarks on AP roads

  • రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న పవన్
  • పవన్ పై ధ్వజమెత్తిన సజ్జల
  • పవన్ కి రాష్ట్రంలో పరిస్థితులు ఏం తెలుసని ఆగ్రహం
  • పత్రికల్లో వచ్చిన వాటిపై స్పందిస్తుంటాడని వ్యాఖ్య  

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విపక్షనేతలపై విరుచుకుపడ్డారు. రోడ్ల అంశంలో ఆందోళన చేపడతామంటున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఎక్కడున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఎక్కడో ఉంటూ ఇక్కడి రోడ్ల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

"పవన్ కల్యాణ్ ఈ రోడ్లపై తిరుగుతూ ఈ వ్యాఖ్యలు చేస్తే ఓ అర్థం ఉంటుంది. బహుశా మొన్న ఎప్పుడో జెండా ఎగరేయడానికి వచ్చినట్టున్నాడు. అంతకుముందు ఓ ఏడాది కింద వచ్చాడేమో! రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆయనకు ఏంతెలుసు? పత్రికల్లో వచ్చినవాటిపై కామెంట్లు చేస్తున్నట్టుంది. దీనిపై ఇంతకుమించి స్పందించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వర్షాల్లోనూ రోడ్ల మరమ్మతులు చేస్తామని వస్తే వారికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే" అని సజ్జల వ్యాఖ్యానించారు.

ఓ వర్గం మీడియాపైనా సజ్జల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్లు తగ్గిస్తోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో, ముఖ్యంగా వృద్ధుల్లో అపోహలు సృష్టించడానికి ఓ వర్గం మీడియా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బాబు దిగిపోయిన నాటి నుంచి ఆ మీడియా ఉక్కిరిబిక్కిరి అవుతోందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు హయాంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వం ఒకటో తేదీ రాగానే 60 లక్షల మందికి నిర్విఘ్నంగా పెన్షన్లు ఇస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు. రెండేళ్ల కాలంలో 10 లక్షల మందికి పైగా పెన్షన్లకు అర్హత పొంది, ప్రయోజనాలు అందుకుంటున్నారని వివరించారు.

చంద్రబాబు ఇచ్చిన దానికంటే మూడు రెట్లు ఎక్కువే ఇస్తున్నామని, ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టీడీపీకి కరపత్రంలా ఉంటాం అని చెప్పి వార్తలు రాయండి' అంటూ చురకలు అంటించారు. బాబు అంత బ్రహ్మాండంగా పనిచేసి ఉంటే ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారని సజ్జల ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News