America: పాలనా వ్యవహారాలపై తాలిబన్ల దృష్టి.. కేబినెట్ కూర్పుపై సంప్రదింపులు పూర్తి
- తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా కనుసన్నల్లోనే ప్రభుత్వం
- రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించనున్న ఘనీ బరాదర్
- అమెరికా రక్షణ సామగ్రితో తాలిబన్ల కవాతు
ఆఫ్ఘనిస్థాన్‌ను వశం చేసుకున్న తాలిబన్లు ఇప్పుడు దేశ పాలనపై దృష్టిసారించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వంలోని కొందరు నేతలు, ఇతర ప్రముఖులతో సంప్రదింపులు జరిపిన తాలిబన్లు కేబినెట్ కూర్పుపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. తమ రాజకీయ విభాగపు అగ్రనేత అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలోని ప్రత్యేక మండలి రోజువారీ పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ సభ్యుడు బిలాల్ కరీమీ తెలిపారు.
అలాగే, పరిపాలన కోసం ఏర్పాటయ్యే మండలికి తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా అధిపతిగా ఉంటారని పేర్కొన్నారు. ఆయన కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుచుకుంటుందని వివరించారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమై చాలా రోజులే అయినా ఈ ఇద్దరు నేతలు ఇప్పటి వరకు బహిరంగంగా కనిపించలేదు. ప్రస్తుతం కాందహార్‌లోనే ఉన్న వీరిద్దరూ త్వరలోనే బహిరంగంగా కనిపిస్తారని తెలుస్తోంది.
మరోవైపు, ఆఫ్ఘన్ నుంచి వెళ్తూ అమెరికా వదిలేసి వెళ్లిన రక్షణ సామగ్రి, ఆఫ్ఘన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను కాందహార్‌లో నిన్న బహిరంగంగా ప్రదర్శించారు. అనంతరం వాటితో కవాతు నిర్వహించారు.