Telangana: వరంగల్ హత్యల కేసులో నిందితుల అరెస్ట్
- ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పశువుల వ్యాపారంలో గొడవల వల్లే హత్యలు
- కోర్టులో హాజరుపరుస్తామన్న పోలీసులు
వరంగల్ హత్యలకు సంబంధించి పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు షఫీ సహా హత్యకు సహకరించిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. వ్యాపార లావాదేవీల్లో గొడవల కారణంగా వరంగల్ లో సొంత అన్న కుటుంబాన్ని తమ్ముడు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.
ప్రధాన నిందితుడు షఫీ, అతడికి సహకరించిన సాజిద్, మీర్జా అక్బర్, పాషా, రాగుల విజేందర్, బోయిని వెంకన్నను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పశువుల వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలపై తలెత్తిన భేదాభిప్రాయాలతోనే తన అన్న చాంద్ పాషా, అతడి భార్య సబీరా బేగం, వారి కుమారులు ఫహద్ పాషా, సమీర్ పాషా, పాషా బావమరిది ఖలీల్ పై రంపంతో దాడి చేశారని చెప్పారు. ఘటనలో చాంద్ పాషా, సబీరా, ఖలీల్ లు అక్కడికక్కడే చనిపోయారన్నారు. ఫహద్, సమీర్ లు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామన్నారు.