USA: 500 ఏళ్లలో ఒకసారి వచ్చే వర్షం.. అమెరికాను అతలాకుతలం చేస్తున్న ‘ఇడా’

New York and New Jersey Recorded Highest Rainfall ever In History

  • న్యూయార్క్ లో తొలిసారి వరద ఎమర్జెన్సీ
  • న్యూజెర్సీలోనూ ఆత్యయిక స్థితి విధింపు
  • విమానాలు, రైలు సర్వీసుల రద్దు
  • టెన్నిస్ మ్యాచ్, సబ్ వేల్లో చిక్కుకున్న ప్రజలు

అమెరికాను హరికేన్ ( పెను తుపాను) 'ఇడా' వణికిస్తోంది. పోతూపోతూ న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ లను ముంచెత్తేసింది. మునుపటి వర్షపాత రికార్డులను తిరగరాసింది. దీంతో ఆ మూడు నగరాలను వరదలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడ ప్రజా జీవితం స్తంభించిపోయింది. తుపానుతో న్యూయార్క్, న్యూజెర్సీలు ఆత్యయిక స్థితిని ప్రకటించాయి. న్యూయార్క్ నగరంలో తొలిసారిగా ‘ఫ్లాష్ ఫ్లడ్’ ఎమర్జెన్సీని విధించారు.

నగరంలో రికార్డ్ స్థాయిలో 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1869 నుంచి నమోదైన వర్షపాతాల్లో ఇదే రికార్డ్. 500 ఏళ్లలో ఒకసారి వచ్చే అత్యంత భారీ వర్షపాతం ఇదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్వోఏఏ) ప్రకటించింది.


యూఎస్ ఓపెన్ కోసం స్టేడియానికి వెళ్లిన ప్రేక్షకులంతా అక్కడే చిక్కుకుపోయారు. వారందరినీ సురక్షితంగా తరలించేందుకు అమెరికా టెన్సిస్ అసోసియేషన్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటు న్యూయార్క్ రైల్వే స్టేషన్ సబ్ వేలో ప్రజలు చిక్కుకుపోయారు. వారినీ సురక్షిత ప్రాంతాలకూ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

నెవార్క్, న్యూజెర్సీల్లో 21.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరదలకు ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయా నగరాల వర్షపాత చరిత్రల్లోనూ ఇదే రికార్డ్. అంతకుముందు 1977లో 17.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెవార్క్ లో కురిసిన వర్షం వెయ్యేళ్లలో ఒకటి అని ఎన్వోఏఏ తెలిపింది. వర్షాలు, వరదలతో పలు విమానాలు రద్దయ్యాయి. రైల్వే సర్వీసులను ప్రభుత్వం రద్దు చేసింది. న్యూజెర్సీలోని గ్లోసెస్టర్ కౌంటీలో టోర్నడో విధ్వంసం సృష్టించింది. ఇళ్లను నేలమట్టం చేసింది.  

మానవ తప్పిదాల వల్ల తలెత్తిన భూతాపం వల్లే ఇలాంటి అకాల వర్షాలు కురుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. జర్మనీ, చైనా వంటి దేశాల్లో కురిసిన వర్షాలూ అందుకు నిదర్శనమంటున్నారు.


ఎమర్జెన్సీ విధించిన ప్రాంతాలివే...

న్యజెర్సీలోని బెర్గెన్ కౌంటీ, ఎసెక్స్ కౌంటీ, హడ్సన్ కౌంటీ, పజాయిక్ కౌంటీ, యూనియన్ కౌంటీ, న్యూయార్క్ లోని బ్రాంక్స్ కౌంటీ, కింగ్స్ బ్రూక్లిన్ కౌంటీ, న్యూయార్క్ (మాన్ హాటన్) కౌంటీ, క్వీన్స్ కౌంటీ, రిచ్ మండ్ (స్టేటెన్ ఐలండ్) కౌంటీ, సదరన్ వెస్ట్ చెస్టర్ కౌంటీల్లో ఆత్యయిక స్థితిని విధించారు.

  • Loading...

More Telugu News