AP High Court: మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును కొట్టివేసిన హైకోర్టు
- గత నెలరోజులుగా విచారణ.. నేడు తీర్పు
- దమ్మాలపాటి శ్రీనివాస్ కు హైకోర్టు క్లీన్ చిట్
- దమ్మాలపాటిపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు
- అక్రమ కేసులు పెట్టినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తీర్పు
మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు మరికొందరిపై... అమరావతి భూముల వ్యవహారంలో పెట్టిన ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఈ కేసును నెల రోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది.
ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈరోజు తీర్పును వెలువరించింది. దమ్మాలపాటి, ఆయన బంధువులు, కుటుంబీకులపై చేసిన ఆరోపణలు నిరాధారమని హైకోర్టు తెలిపింది. దమ్మాలపాటిపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు... దమ్మాలపాటిపై అక్రమంగా కేసులు నమోదు చేసి, ఆయనను మానసిక వేదనకు గురి చేసినందుకు చట్ట ప్రకారం ఆయన చర్యలు తీసుకోవచ్చని సూచించింది.