new zealand: న్యూజిలాండ్ లోని సూపర్ మార్కెట్లో బీభత్సం సృష్టించిన ఐఎస్ఐఎస్ ప్రభావిత తీవ్రవాది
- సూపర్ మార్కెట్లోకి చొరబడి కొందరిపై కత్తితో దాడి
- ఆరుగురికి తీవ్రగాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
- నిందితుడు శ్రీలంక జాతీయుడిగా గుర్తింపు
న్యూజిలాండ్ ఇస్లామిక్ స్టేట్ ప్రభావిత తీవ్రవాది ఒకరు సూపర్ మార్కెట్లోకి చొరబడి కొందరిపై కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించాడు. ఈ రోజు ఉదయం కలకలం రేపిన ఈ ఘటనపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మీడియాతో మాట్లాడారు. ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చెందిన ఓ వ్యక్తి జరిపిన ఈ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయని వివరించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.ఈ దాడి జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు కాల్చి చంపేశారని వివరించారు.
సూపర్ మార్కెట్లోకి చొరబడి పౌరులపై దాడికి దిగడాన్ని హేయమైన, విద్వేషపూరిత చర్యగా ఆమె అభివర్ణించారు. హింసాత్మక భావజాలం, ఐఎస్ఐఎస్ ప్రభావం వల్లే ఆ తీవ్రవాది ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె చెప్పారు. అతడు శ్రీలంకు చెందిన వ్యక్తి అని, 2011లో న్యూజిలాండ్ వచ్చాడని, ఉగ్రవాదులతో సంబంధాల నేపథ్యంలో అతడిపై 2016 నుంచి నిఘా ఉంచామని వివరించారు.
కాగా, న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని అల్ నూర్ మసీదు వద్ద 2019లో ఓ శ్వేతజాతీయుడు జరిపిన కాల్పుల్లో 51 మంది ముస్లింలు మృతి చెందారు. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆ ఘటన నేపథ్యంలో అధికారులు మరోసారి ఇటువంటి దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.