COVID19: మీరు చర్యలు తీసుకునే సరికి మూడో వేవ్ కూడా ముగిసిపోతుంది: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- కరోనా మరణాల పరిహారంపై విచారణ
- మార్గదర్శకాలు ఇంకెప్పుడిస్తారని నిలదీత
- తమ ఆదేశాలను పట్టించుకోవట్లేదంటూ మండిపాటు
- వారంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
కరోనాతో మరణించిన వారి కటుంబాలకు పరిహారం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారంపై ఇంకెప్పుడు మార్గదర్శకాలను సిద్ధం చేస్తారని నిలదీసింది. ప్రభుత్వం మార్గదర్శకాలను తయారు చేసే సరికి కొవిడ్ థర్డ్ వేవ్ కూడా అయిపోయేటట్టుందని అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు పరిహారం మార్గదర్శకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై ఇవాళ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ ల ధర్మాసనం విచారించింది.
‘‘మరణ ధ్రువీకరణ పత్రం, పరిహారానికి సంబంధించి ఉత్తర్వులు ఎప్పుడో వెలువడ్డాయి. అయినా మీరింకా మార్గదర్శకాలను సిద్ధం చేయట్లేదు. మీరు ఆ తదుపరి చర్యలు తీసుకునేటప్పటికి మూడో వేవ్ కూడా ముగిసిపోతుంది’’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పరిహారం విషయం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని సొలిసిటర్ జనరల్ చెప్పడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీసింది. పరిహారం విషయంలో తీసుకుంటున్న చర్యలపై వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కాగా, గత నెల 16న జరిగిన విచారణ సందర్భంగా.. కరోనా మరణాల పరిహారానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనకు కేంద్రానికి సుప్రీంకోర్టు 4 వారాల గడువునిచ్చింది. అయితే అందుకు తీసుకుంటున్న చర్యలను రెండు వారాల్లోనే చెప్పాలని ఆదేశించింది.