Afghanistan: కశ్మీర్ పై గళమెత్తే హక్కు మాకుంది: తాలిబన్ అధికార ప్రతినిధి
- ముస్లింలుగా ముస్లింల కోసం గొంతెత్తుతామన్న సుహైల్
- అన్ని దేశాల్లోని ముస్లింల హక్కులపై పోరాడుతాం
- అమెరికా రమ్మంటే.. లక్షల మంది భారతీయులు క్యూ కడతారు
- దానర్థం భారత ప్రభుత్వానికి భయపడినట్టా?
తాలిబన్ల రాజ్యంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ పై కుట్రలు జరిగే ప్రమాదముందన్న ఆందోళనల నేపథ్యంలోనే.. తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. కశ్మీర్ ముస్లింల గురించి గొంతెత్తే హక్కు తమకుందని ప్రకటించుకున్నారు. రెండు వేర్వేరు సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ముస్లింలుగా భారత్ లోని కశ్మీర్ లో ఉంటున్న ముస్లింలు సహా వేరే ఏ దేశంలోని ముస్లింల గురించైనా గళమెత్తే హక్కు మాకుంది. ముస్లింలూ మీ వాళ్లే.. మీ దేశ పౌరులే అని గట్టిగా చెబుతాం. అందరిలాగే వారికీ సమాన హక్కులుంటాయని గళం వినిపిస్తాం’’ అని ఆయన అన్నారు. కశ్మీర్ కోసమూ తాలిబన్లు పోరాడాలంటూ రెండు రోజుల క్రితమే అల్ ఖాయిదా వారికి సందేశం పంపింది. ఈ నేపథ్యంలో సుహైల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆఫ్ఘన్ నుంచి చాలామంది బయటి దేశాలకు వలసపోతుండడంపై కూడా ఆయన స్పందించారు. అందరినీ తీసుకెళ్లి శాశ్వత నివాసం ఇస్తామని అమెరికా అంటే కొన్ని లక్షల మంది భారతీయులు ఢిల్లీ విమానాశ్రయానికి క్యూ కడతారని, దానర్థం భారత ప్రభుత్వానికి భయపడి వారు పారిపోతున్నారనా? అని సుహైల్ ప్రశ్నించారు.
తమ వల్లే కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ సంఖ్యలో జనం గుమికూడారన్నది అబద్ధమన్నారు. తరలింపులు జరిపిన అమెరికాదే ఆ తప్పు అని చెప్పారు. విమానాశ్రయం వద్ద గుమికూడిన వారిలో చాలా మంది అమెరికాతో గానీ, నాటో దేశాలతో గానీ పనిచేయలేదన్నారు. కేవలం ఆఫ్ఘన్ ను వీడి పాశ్చాత్య దేశాల్లో సెటిల్ అవుదామనుకున్న వారే ఎయిర్ పోర్టుకు వెళ్లారని సుహైల్ చెప్పారు.