Afghanistan: ఆఫ్ఘన్​ ప్రభుత్వ పగ్గాలు బరాదర్​ కే!

Baradar May Take Over Afghan Govt Says Report
  • మరో ఇద్దరికి కీలక పదవులు
  • దేశ ఆర్థిక వ్యవస్థ కోసమేనన్న తాలిబన్లు
  • అతి త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన
  • ఇప్పటికే కాబూల్ కు చేరుకున్న నేతలు
ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ పగ్గాలను తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరాదర్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఆర్థికంగా చితికిపోకుండా ముందుకు సాగేందుకు ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన వెలువడుతుందని, బరాదర్ కే బాధ్యతలు అప్పగిస్తారని తాలిబన్ వర్గాలు చెబుతున్నాయి.

తాలిబన్ అధిపతి ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా మహ్మద్ యాకూబ్, షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్ తో కలిపి ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందని అంటున్నారు. ఆ ఇద్దరికి కీలక పదవులను ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆ ముగ్గురు నేతలు కాబూల్ కు చేరుకున్నారని, నూతన ప్రభుత్వానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెబుతున్నారు.  

దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడాలంటే అంతర్జాతీయ ఆర్థిక సహకారం, పెట్టుబడులే ఇప్పుడు కీలకం కానున్నాయి. ఎన్నో ఏళ్ల పాటు కరవు, యుద్ధ పరిస్థితులతో అల్లాడిపోయిన ఆఫ్ఘనిస్థాన్.. 2001లో తాలిబన్ల రాజ్యం కుప్పకూలాక కొద్దిగా కుదుటపడింది. ప్రజా ప్రభుత్వం కొలువు దీరడం, భారత్ సహా వివిధ దేశాలు అక్కడ పెట్టుబడులు పెట్టడం, మానవతా దృక్పథంతో చేదోడుగా నిలవడంతో ఆర్థికంగా మెరుగైంది.

ఇప్పుడు మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో కొద్దోగొప్పో జరిగిన ఆ అభివృద్ధి కూడా ప్రశ్నార్థకమైందని నిపుణులు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ముప్పుందని ఆఫ్ఘనిస్థాన్ లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ మేరీ ఎలెన్ మెక్ గ్రోవర్థీ అన్నారు. తాలిబన్లు అధికారం చేపట్టడంతో నిధులను ఇచ్చేందుకు అమెరికా కూడా వెనకడుగు వేస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఆఫ్ఘన్ విదేశీ నిల్వలను ఆ దేశం ఫ్రీజ్ చేసింది. ఒకే ఒక్క ఉపశమనమేంటంటే.. ఆఫ్ఘన్ లో మానవతా కార్యక్రమాల కోసం అమెరికా సహకారంతో డబ్బును పంపిస్తామని వెస్టర్న్ యూనియన్ సంస్థ ప్రకటించడం.
Afghanistan
Taliban
Mullah Baradar
USA
Economy

More Telugu News