Prakash Raj: 'మా' పోటీ నుంచి తప్పుకుని ప్రకాశ్ రాజ్ పక్షాన చేరిన జీవిత, హేమ... ఏం జరిగిందో చెప్పిన ప్రకాశ్ రాజ్
- త్వరలో మా అధ్యక్ష ఎన్నికలు
- కార్యవర్గాన్ని ప్రకటించిన ప్రకాశ్ రాజ్
- ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో జీవిత, హేమలకు చోటు
- వారిద్దరితో చర్చించిన ప్రకాశ్ రాజ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 'మా' అధ్యక్ష పదవికి పోటీపడిన జీవితా రాజశేఖర్, హేమ అనూహ్యరీతిలో పోటీ నుంచి వైదొలిగారు. అంతకంటే ఆశ్చర్యకరంగా వాళ్లిద్దరూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చేరారు. 'మా' అధ్యక్ష ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా ఉన్న ప్రకాశ్ రాజ్ తాజాగా తన ప్యానెల్ ను ప్రకటించారు. ఇందులో హేమ ఉపాధ్యక్షురాలిగా పోటీపడుతుండగా, జీవితా రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై ప్రకాశ్ రాజ్ వివరణ ఇచ్చారు.
ఈసారి హేమ, జీవిత కూడా 'మా' రేసులో ఉంటారని అందరూ అనుకున్నారని తెలిపారు. అయితే తాను హేమతో ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితి వివరించానని, ఆమె పోటీ నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని వెల్లడించారు. అందరం కలిసి ఉందాం అని ఆమెకు ప్రతిపాదించగా, ఆమె అందుకు సమ్మతం తెలిపారని వివరించారు. హేమ ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న మహిళ అని, అందుకే ఆమెకు ప్యానెల్లో చోటు కల్పించామని చెప్పారు.
ఇక జీవితతో రెండున్నర గంటలు చర్చించినట్టు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. 'మా' కోసం తాను రూపొందించుకున్న ప్రణాళికను జీవితకు వివరించానని వెల్లడించారు. సమష్టిగా ఉందామన్న ప్రతిపాదనకు ఆమె సానుకూలంగా స్పందించి, బరి నుంచి తప్పుకున్నారని తెలిపారు. అంతేకాకుండా, తమ ప్యానెల్లో పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని వివరించారు. పైగా, రాజశేఖర్ మద్దతు కూడా తమ ప్యానెల్ కు ఉంటుందని జీవిత చెప్పినట్టు ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.