Supreme Court: 12 హైకోర్టులకు 68 మంది న్యాయమూర్తులను సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం
- న్యాయమూర్తుల ఎంపికకు రెండుసార్లు సమావేశం
- మొత్తం 113 మంది పేర్ల పరిశీలన
- 68 మందిలో పదిమంది మహిళలు
- షెడ్యూల్డ్ తెగకు చెందిన మిజోరం జ్యుడీషియల్ అధికారి పేరును గౌహతి హైకోర్టుకు సిఫారసు
దేశ న్యాయవ్యవస్థలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆయన నేతృత్వంలోని కొలీజియం ఇటీవల 9 మంది న్యాయమూర్తులను సుప్రీంకోర్టులో నియమించగా, తాజాగా దేశంలోని 12 హైకోర్టులకు ఒకేసారి 68 మంది పేర్లను సిఫార్సు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల్లో 10 మంది మహిళలు ఉన్నారు. ఆగస్టు 25, ఈ నెల ఒకటో తేదీన జరిగిన సమావేశాల్లో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎ.ఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని కొలీజయం మొత్తం 113 మంది పేర్లను పరిశీలించింది. వీరిలో 82 మంది న్యాయవాదులు, 31 మంది జ్యుడీషియల్ సర్వీసు అధికారులు ఉన్నారు.
చివరికి వీరిలో 44 మంది న్యాయవాదులు, 24 మంది జ్యుడీషియల్ సర్వీసెస్ అధికారులను హైకోర్టు న్యాయమూర్తుల పదవులకు సిఫార్సు చేయాలని కొలీజియం నిర్ణయించింది. షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళా జ్యుడీషియల్ అధికారి మరాలి వంకుంగ్ పేరును గౌహతి హైకోర్టుకు సిఫార్సు చేసింది. రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిజోరం నుంచి వచ్చిన తొలి హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె రికార్డులకెక్కుతారు.