Mogulayya: కిన్నెర కళాకారుడు మొగులయ్యకు ఆర్థికసాయం ప్రకటించిన పవన్ కల్యాణ్
- భీమ్లా నాయక్ పాట సాకీ ఆలపించిన మొగులయ్య
- గాత్ర, వాద్య సహకారం అందించిన వైనం
- 12 మెట్ల కిన్నెరపై అద్భుత స్వరాలు
- ముగ్ధుడైన పవన్ కల్యాణ్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా టైటిల్ సాంగ్ ఇటీవలే రిలీజ్ కాగా, అభిమానుల స్పందన మామూలుగా లేదు. భీమ్లా నాయక్ అంటూ సాగే ఈ పాటలో మొదట వచ్చే పరిచయ వాక్యాలను కిన్నెర కళాకారుడు మొగులయ్య ఆలపించారు. మొగులయ్య తన ఈ పాటలో కిన్నెర వాయిద్యాన్ని రమ్యంగా మీటుతూ భీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలను పరిచయం చేశాడు.
కాగా, మొగులయ్య వంటి జానపద కళాకారులపై పవన్ కల్యాణ్ కు మొదటి నుంచి అభిమానం ఉంది. ఈ నేపథ్యంలో మొగులయ్యకు రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. తాను స్థాపించిన పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ ద్వారా ఈ ఆర్థికసాయం అందించనున్నారు. మొగులయ్యకు ఆర్థికసాయంపై పవన్ కల్యాణ్ ఇప్పటికే తన కార్యాలయ సిబ్బందికి సూచనలు చేశారు. త్వరలోనే మొగులయ్యకు చెక్కును అందజేయనున్నారు.
మొగులయ్య స్వస్థలం తెలంగాణలోని ఆమ్రాబాద్ రిజర్వ్ అటవీప్రాంతం. ప్రత్యేకంగా 12 మెట్ల కిన్నెర వాయిద్యాన్ని రూపొందించి, దానిపై అద్భుతమైన రీతిలో స్వరాలు పలికిస్తూ గానం చేస్తుంటాడు. కిన్నెర వాద్యకారుడు మొగులయ్యను పవన్ అరుదైన కళాకారుడిగా గుర్తించారు. ఇటువంటి ప్రత్యేకమైన జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలని ఆయన భావిస్తున్నారు.