Tirumala: తిరుమల అప్డేట్.. తెరుచుకోనున్న అలిపిరి మెట్ల మార్గం!
- అక్టోబర్ 1 నుంచి అలిపిరి మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి
- ఈ నెల 13 నుంచి అగరబత్తీల అమ్మకాలు
- ఈ నెల 19న అనంతపద్మనాభస్వామి వ్రతం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ కొండపైకి వెళ్తుంటారు. అలా తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇక భక్తులు కొండపైకి వెళ్లడానికి రెండు మెట్ల మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్ల మార్గం కాగా, రెండోది శ్రీవారి మెట్టు మార్గం. అయితే, ఎక్కువ మంది అలిపిరి మార్గం ద్వారానే కొండ ఎక్కుతుంటారు.
అయితే, మరమ్మతులు, ఆధునికీకరణ కోసం అలిపిరి మార్గాన్ని కొన్ని నెలల క్రితం టీటీడీ అధికారులు మూసేశారు. దీంతో, ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే భక్తులు కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులను అనుమతించనున్నట్టు ప్రకటించింది.
ఇక ఈనెల 13 నుంచి టీటీడీ అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి వస్తాయని చెప్పింది. సప్తగిరులకు గుర్తుగా ఏడు రకాల అగరబత్తీలను తీసుకొస్తున్నామని తెలిపింది. బ్రహ్మోత్సవాల నుంచి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను విక్రయిస్తామని చెప్పింది. ఈ నెల 19న అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని, పుష్కరిణిలో ఏకాంత చక్రస్నానాన్ని నిర్వహించనున్నట్టు తెలిపింది.