Buggana Rajendranath: అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు అప్పులు చేస్తున్నాయి: ఆర్థికమంత్రి బుగ్గన
- అప్పుల విషయంలో ఏపీ సర్కారుపై విపక్షాల విమర్శలు
- విపక్ష నేతల ఆరోపణలు హేయమన్న మంత్రి
- టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేశారని ఆరోపణ
ఏపీ ప్రభుత్వం లెక్కకుమిక్కిలిగా అప్పులు చేసుకుంటూ పోతోందని విపక్షాలు గగ్గోలు పెడుతుండడంపై రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు అప్పులు చేస్తున్నాయని అన్నారు. అప్పులపై విపక్ష నేతల ఆరోపణలు హేయమని అభిప్రాయపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేశారని వివరించారు.
కరోనా కట్టడి కోసం రూ.7,130.19 కోట్లకు పైగా వెచ్చించామని, కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నామని తెలిపారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువేనని, అందుకు రూ.25,914.13 కోట్లు ఖర్చు చేశామని బుగ్గన వివరించారు. అవ్వాతాతలకు ఇంటింటికి రూ.37,461.89 కోట్లను పింఛన్ల రూపంలో అందించామని వెల్లడించారు. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాల కింద రూ.17,608.43 కోట్ల మేర లబ్ది చేకూర్చామని తెలిపారు.
అనేక పథకాలతో మహిళల స్వయం ఉపాధి మార్గాలకు బాటలు వేశామని చెప్పారు. అన్ని రకాలుగా సామాన్యులకు భరోసా కల్పించిన ప్రభుత్వం ఇది అని ఉద్ఘాటించారు. నేరుగా ప్రజల చేతికే డబ్బు అందించడం ద్వారా వస్తువులు, సేవల డిమాండ్ దెబ్బతినకుండా కాపాడగలిగామని వివరణ ఇచ్చారు. అనేక కంపెనీలను నిలబెట్టగలిగామని తెలిపారు.
తాము ఇంత చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ఠ పాల్జేసేందుకే టీడీపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. అబద్ధాలు, అసంబద్ధ అంశాలతో టీడీపీ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు.