Movies: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలను థియేటర్లలో విడుదల చేయం: థియేటర్ల యజమానుల సంఘం
- ఓటీటీలో విడుదలైతే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోతారంటున్న ఎగ్జిబిటర్లు
- దీనివల్ల నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్య
- సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని డిమాండ్
ఓటీటీలో సినిమాలు విడుదల కావడం ఇప్పుడు సినీ పరిశ్రమలో సరికొత్త వివాదాలకు కారణమవుతోంది. కరోనా నేపథ్యంలో ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేసేందుకు పలువురు హీరోలు, దర్శకనిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయంలో ఓటీటీలో సినిమాలను విడుదల చేయడాన్ని థియేటర్ల యజమానులు అంగీకరించడం లేదు. ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోతారని... అది తమకు నష్టాలను తీసుకొస్తుందని, దాని ఫలితం మొత్తం సినీ పరిశ్రమపై పడుతుందని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో థియేటర్ల యజమానుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఓటీటీలో ప్రదర్శించే చిత్రాలను థియేటర్లలో విడుదల చేయడానికి తాము అంగీకరించే ప్రసక్తే లేదని ప్రకటనలో స్పష్టం చేసింది. థియేటర్లలో విడుదల చేసే కొత్త సినిమాలను నాలుగు వారాలు గడిచిన మీదటే ఓటీటీలో ప్రదర్శించేందుకు అనుమతించాలని పేర్కొంది.