doctor: 7 గంటల్లో 101 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్.. వైద్యుడిపై విచారణకు ఆదేశం
- ఇది నిబంధనల ఉల్లంఘన అంటున్న నిపుణులు
- ఒక వైద్యుడు రోజుకు 30 ఆపరేషన్లు మాత్రమే చేయాలని రూల్
- ఛత్తీస్‌గఢ్ వైద్యుడి అత్యుత్సాహం
ఛత్తీస్‌గఢ్‌లోని సర్గూజా జిల్లాలో ఇటీవల ఒక ఉదంతం జరిగింది. వైద్యుల పరువు తీసేలా ఉన్న ఈ ఘటనలో ఒక డాక్టర్.. కేవలం 7 గంటల్లో 101 మంది మహిళలకు ట్యూబెక్టమీ అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాడు. కానీ నిబంధనల ప్రకారం, ఒక వైద్యుడు రోజులో గరిష్ఠంగా 30 శస్త్రచికిత్సలు మాత్రమే చేయాలి.
ఇంతకన్నా ఎక్కువ చేస్తే వైద్యుడు తన అప్రమత్తతను కోల్పోయి, ఆపరేషన్లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇవన్నీ తెలిసిన ఈ వైద్యుడు మాత్రం నిబంధనల్లో పేర్కొన్న దానికి మూడు రెట్ల శస్త్రచికిత్సలను కేవలం 7 గంటల్లోనే చేసేశాడు. ఆగస్టు 27న మెయిన్‌పట్‌లోని నర్మదాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక స్టెరిలైజేషన్ క్యాంప్ జరిగింది. ఇక్కడే ఒక వైద్యుడు ఇలా చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ విషయంలో ఫిర్యాదులు అందడంతో దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఒక కమిటీ వేశామని, కమిటీ నివేదిక సమర్పించగానే చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ అలోక్ శుక్లా తెలిపారు. ఈ కేసులో ఆపరేషన్లు చేసిన వైద్యుడు, స్థానిక ఆరోగ్య అధికారికి ఇప్పటికే నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు.