Rohit Sharma: రోహిత్ శర్మ సెంచరీ, పుజారా అర్ధసెంచరీ... 100 దాటిన టీమిండియా ఆధిక్యం
- నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో భారత్
- రెండో ఇన్నింగ్స్ లో 77 ఓవర్లలో 223/1
- భారత్ ఆధిక్యం 124 రన్స్
- ఆటకు నేడు మూడో రోజు
లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించగా, ఛటేశ్వర్ పుజారా అర్ధసెంచరీతో రాణించాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా స్కోరు 1 వికెట్ నష్టానికి 223 పరుగులు కాగా, ఓవరాల్ ఆధిక్యం 124 పరుగులకు చేరింది. రోహిత్ శర్మ 120, పుజారా 55 పరుగులతో ఆడుతున్నారు.
ఆటకు నేడు 3వ రోజు కాగా, మరో రెండ్రోజుల ఆట మిగిలుండడంతో ప్రస్తుతానికి భారత్ మెరుగైన స్థితిలో ఉన్నట్టు భావించాలి. ఇక్కడి పిచ్ పై రెండో ఇన్నింగ్స్ లో 300 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించాల్సి రావడం కష్టమైన పనే! రేపు నాలుగో రోజు ఆటలో భారత్ మూడు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసినా చాలు... ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంటుంది.