Taliban: తాలిబన్ల వల్లే పెట్రోలు ధరల పెరుగుదల.. బీజేపీ నేత కామెంట్స్
- కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వ్యాఖ్యలు
- ఆఫ్ఘన్ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా దెబ్బతిన్నదన్న నేత
- యడియూరప్ప స్థానంలో సీఎం సీటు కోసం రేసులో నిలిచిన సీనియర్
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధర పెరుగుదలపై కొన్ని రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ విషయంలో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తెగ విమర్శలు చేస్తున్న సంగతి విదితమే. ఇలాంటి సమయంలో కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ఆఫ్ఘనిస్థాన్‌లో తలెత్తిన తాలిబన్ సంక్షోభమే కారణమని ఆయన వివరించారు.
ఆఫ్ఘన్ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరా దెబ్బతిన్నదని చెప్పిన ఆయన.. ఈ కారణంగానే మన దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరిగాయని చెప్పారు. హుబ్లి-ధార్వాడ్‌లోని పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్యే.. యడియూరప్ప రాజీనామా చేసిన సమయంలో సీఎం రేసులో నిలిచిన సంగతి తెలిసిందే.
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం మే నెలలో ప్రారంభమై ఆగకుండా పెరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి, ఆఫ్ఘనిస్థాన్‌తో ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. జులై 2021 నాటికి భారత్‌కు ముడి చమురు అమ్ముతున్న 6 ముఖ్యమైన దేశాలు ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, నైజీరియా, యూఎస్ఏ, కెనడా. కాగా, ఆయిల్, గ్యాస్ ధరలపై ఆఫ్ఘన్ సంక్షోభం ప్రభావం చూపే అవకాశం మాత్రం ఉందని పేర్కొన్న సదరు వార్తాసంస్థ.. ఇప్పటి వరకైతే ఇలాంటి ప్రభావం పడినట్లు ఆధారాల్లేవని తేల్చిచెప్పింది.