Nand Kumar Baghel: చత్తీస్ గఢ్ సీఎం తండ్రిపై కేసు నమోదు... చట్టానికి ఎవరూ అతీతులు కారన్న సీఎం బాఘేల్
- బాఘేల్ తండ్రి నందకుమార్ పై కేసు నమోదు
- బ్రాహ్మణులను బహిష్కరించాలన్న నందకుమార్
- ఫిర్యాదు చేసిన సర్వ బ్రాహ్మణ సమాజ్
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన డీడీ నగర్ పోలీసులు
చత్తీస్ గఢ్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ తండ్రి నందకుమార్ బాఘేల్ పై కేసు నమోదైంది. ఆయన ఇటీవల ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డీడీ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నందకుమార్ ఇటీవల బ్రాహ్మణులను బహిష్కరించాలంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వ బ్రాహ్మణ సమాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సెక్షన్ 153-ఏ, 505 (1) (బి) కింద కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై సీఎం భూపేష్ బాఘేల్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఉద్ఘాటించారు. "చట్టానికి ఎవరూ అతీతులు కారు. 86 ఏళ్ల మా నాన్న కూడా అందుకు మినహాయింపు కాదు. చత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తుంది. అన్ని వర్గాలను, అన్ని సమాజాలను గౌరవిస్తుంది. ప్రతి ఒక్కరి మనోభావాలకు విలువనిస్తుంది. ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మా నాన్న చేసిన వ్యాఖ్యలు మత సామరస్యానికి భంగం కలిగించాయని భావిస్తున్నాం. ఆయన వ్యాఖ్యల పట్ల నేను కూడా బాధపడుతున్నా" అని వివరించారు.