Team India: రెండో ఇన్నింగ్స్ లో భారత్ 466 ఆలౌట్... ఇంగ్లండ్ లక్ష్యం 368 రన్స్

Team India puts huge target before England

  • భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు
  • లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ వేదికగా మ్యాచ్
  • రెండో ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్ల అద్భుత పోరాటం
  • ఆటకు రేపు ఆఖరి రోజు

నాలుగో టెస్టులో భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 466 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఇంగ్లండ్ ముందు 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు ఆటలో శార్దూల్ ఠాకూర్ (60), రిషబ్ పంత్ (50)ల ఆట హైలైట్ అని చెప్పాలి.

భారత్ ను రెండో ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకు పరిమితం చేయాలన్న ఇంగ్లండ్ ఆశలను వీరిద్దరూ వమ్ము చేశారు. వీరు అవుటైనా ఉమేశ్ యాదవ్ (25), జస్ర్పీత్ బుమ్రా (24) కూడా బ్యాట్లకు పనిచెప్పడంతో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, రాబిన్సన్ 2, మొయిన్ అలీ 2, ఆండర్సన్ 1, రూట్ 1 వికెట్ తీశారు.

లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన 263 పరుగులు. ఆ లెక్కన ఇంగ్లండ్ కు ఈ మ్యాచ్ లో గెలవడం ఏమంత సులువు కాదని తెలుస్తోంది. 368 పరుగుల టార్గెట్ ఏ రకంగా చూసినా ఆతిథ్య జట్టుకు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఆటకు రేపు చివరి రోజు కాగా, టీమిండియా పేసర్ల దూకుడును తట్టుకుని ఇంగ్లండ్ ఏంచేస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

ఈ టెస్టులో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 191 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 290 పరుగులు చేసి కీలకమైన 99 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే, రెండో ఇన్నింగ్స్ లో అద్భుత పోరాటపటిమ కనబర్చిన టీమిండియా ఆటగాళ్లు జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపారు.

  • Loading...

More Telugu News