Pastor: బలవంతపు మతమార్పిడులు చేస్తున్నాడంటూ.. పోలీస్ స్టేషన్లోనే పాస్టర్ ని చితకబాదిన హిందూ నేతలు
- రాయపూర్ లో చోటు చేసుకున్న ఘటన
- క్రైస్తవ పాస్టర్ పై మతమార్పిడుల ఆరోపణలు
- స్టేషన్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
- ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
బలవంతపు మతమార్పిడులకు పాల్పడున్నాడంటూ ఒక క్రైస్తవ పాస్టర్ ను పోలీస్ స్టేషన్ లోనే చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాస్టర్ అనుచరులకు, హిందూ నేతలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఈ ఘటన రాయపూర్ లోని పురానీ బస్తీ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.
భాటాగావ్ ప్రాంతంలో మతమార్పిడులు జరుగుతున్నాయనే ఫిర్యాదులు పోలీసులకు అందాయి. ఈ నేపథ్యంలో క్రైస్తవ సమాజానికి చెందిన మరికొందరితో కలిసి సదరు పాస్టర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. కాసేపటికి అక్కడకు పెద్ద ఎత్తున హిందూ నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసుల ముందే పాస్టర్ ను హిందూ సంఘాల నేతలు చితకబాదారు. ఇది జరిగిన వెంటనే పాస్టర్ ను స్టేషన్ ఇన్ఛార్జి గదిలోకి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్న పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ తారకేశ్వర్ పటేల్ మాట్లాడుతూ, ఇరు వర్గాల ఘర్షణ కారణంగా పోలీసు స్టేషన్ కు ఎలాంటి నష్టం కలగలేదని చెప్పారు. పాస్టర్ పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని తెలిపారు. దర్యాప్తులో వెలుగుచూసే అంశాలను బట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు పాస్టర్ పై దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.