Vishnu Vardhan Reddy: వినాయకచవితిపై హైదరాబాదులో లేని ఆంక్షలు ఆంధ్రాలో ఎందుకు?: విష్ణువర్ధన్ రెడ్డి
- ఏపీలో వినాయకచవితిపై ఆంక్షలు
- ఇళ్లలోనే జరుపుకోవాలన్న సర్కారు
- ఆందోళనలకు తెరదీసిన బీజేపీ
- ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్
ఏపీలో బహిరంగ ప్రదేశాల్లో వినాయకచవితి వేడుకలు నిర్వహించడంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు. నిన్న కర్నూలులో కలెక్టర్ నివాసం ముట్టడి చేపట్టిన బీజేపీ శ్రేణులు నేడు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వైసీపీ ప్రభత్వుం తన హిందూ వ్యతిరేక వైఖరిని చాటుకుంటోందని విమర్శించారు.
వినాయకచవితిపై హైదరాబాదులో లేని ఆంక్షలు ఆంధ్రాలో ఎందుకు? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఇతర మతస్తులకు ఒక న్యాయం... హిందువులకు మరో న్యాయమా? అంటూ నిలదీశారు. హైదరాబాదులో వినాయకచవితికి 4 రోజుల ముందే భక్తులకు ఖైరతాబాద్ మహాగణపతి సంపూర్ణ దర్శనం అవకాశం కల్పిస్తున్నారన్న ట్వీట్ ను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వినాయకచవితిపై ఆంక్షలు విధించడం ద్వారా హిందూ సమాజాన్ని ఆపాలనుకుంటే అది ఈ ప్రభుత్వం తరం కాదని విష్ణు స్పష్టం చేశారు. పండుగపై నిర్ణయం మార్చుకోకపోతే ప్రజలు ఈ ప్రభుత్వాన్నే మార్చేస్తారని హెచ్చరించారు. వైసీపీ సర్కారు హిందువుల పట్ల అన్యాయంగా వ్యవహరించడాన్ని తాము సహించబోమని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ నోరు మూయించడానికి ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, ఈ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగి తీరుతుందని ఉద్ఘాటించారు.