Ahmad Massoud: పంజ్ షీర్ లోయ రక్తసిక్తం... కుటుంబ సభ్యులను, ముఖ్య అనుచరుడ్ని కోల్పోయిన అహ్మద్ మసూద్
- పంజ్ షీర్ లోయపై ఆధిపత్యం కోసం తాలిబన్ల దాడులు
- ప్రతిఘటిస్తున్న నార్తర్న్ అలయెన్స్ దళాలు
- ప్రతిఘటన దళాలపై తాలిబన్ల పైచేయి!
- చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతామన్న మసూద్
ఆఫ్ఘనిస్థాన్ లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజ్ షీర్ లోయలో తాలిబన్లకు, నార్తర్న్ అలయన్స్ కు చెందిన ప్రతిఘటన దళాలకు మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతోంది. ఈ పోరులో ప్రతిఘటన దళాలకు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ప్రతిఘటన దళాల అధిపతి అహ్మద్ మసూద్ తన కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఆయన ముఖ్య అనుచరుడు, ప్రతిఘటన దళాల తరఫున సోషల్ మీడియాలో గళం వినిపించే ఫహీం దాష్తి కూడా తాలిబన్లతో పోరాటంలో మృతి చెందారు.
దీనిపై అహ్మద్ మసూద్ తీవ్ర ఆక్రోశం వెలిబుచ్చారు. ఓవైపు పంజ్ షీర్ లో తాలిబన్లు ఆఫ్ఘన్లపై దాడి చేస్తుంటే, అంతర్జాతీయ సమాజం మౌనంగా చూస్తూ ఉందని ఆవేదన వెలిబుచ్చారు. తన కుటుంబ సభ్యులను, తన ముఖ్య అనుచరుడు ఫహీం దాష్తిని చంపేందుకు తాలిబన్లకు పాకిస్థాన్ సహాయం చేసిందని మసూద్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాక్ పాత్ర ఏమిటన్నది అన్ని దేశాలకు తెలిసినా, ఎవరూ స్పందించడం లేదని అన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు పంజ్ షీర్ కోసం పోరాడతామని అహ్మద్ మసూద్ ఉద్ఘాటించారు.