Jaspreeth Bumrah: వికెట్లతో పాటు రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్న బుమ్రా
- నాలుగో టెస్టులో భారత్ విజయం
- కీలకపాత్ర పోషించిన బుమ్రా
- బుమ్రాకు ఈ మ్యాచ్ లో 4 వికెట్లు
- వేగంగా 100 వికెట్ల సాధన
- కపిల్ దేవ్ రికార్డు తెరమరుగు
ఇంగ్లండ్ తో నాలుగో టెస్టులో టీమిండియా విక్టరీలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కీలకపాత్ర పోషించాడు. లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బుమ్రా మొత్తం 4 వికెట్లు తీశాడు. అంతేకాదు, టెస్టుల్లో 100 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు సాధించిన బౌలర్ గా అవతరించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ పేరిట ఉంది.
కపిల్ 100 వికెట్ల మార్కును చేరుకునేందుకు 25 టెస్టులు ఆడగా, బుమ్రా 24 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. అంతేకాదు, మరే భారత బౌలర్ కు సాధ్యం కాని రీతిలో అతి తక్కువ సగటుతో 100 వికెట్లు సాధించింది కూడా బుమ్రానే. బుమ్రా 22.45 సగటుతో 100 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్లలో ఓవరాల్ గా చూస్తే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కేవలం 18 టెస్టుల్లోనే ఆ ఘనత అందుకున్నాడు.