Pfizer: ఆరు నెలలకి తగ్గిపోతున్న ఫైజర్ టీకా పనితనం!
- కేస్ వెస్టర్న్ రిజర్వ్, బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి
- ఆరు నెలల తర్వాత 80 శాతం తగ్గిపోతున్న యాంటీబాడీలు
- బూస్టర్ డోసు అవసరమేనంటున్న శాస్త్రవేత్తలు
ఫైజర్ టీకాపై కేస్ వెస్టర్న్ రిజర్వ్, బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో కీలక విషయం వెల్లడైంది. ఫైజర్ టీకా ప్రభావం ఆరు నెలల తర్వాత తగ్గిపోతోందని అధ్యయనంలో గుర్తించారు. ఫైజర్ టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత శరీరంలో ఉత్పత్తి అయ్యే కొవిడ్ యాంటీబాడీలు ఆరు నెలల తర్వాత 80 శాతం తగ్గిపోతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. నర్సింగ్ హోంలో ఉంటున్న 120 మంది, 92 మంది ఆరోగ్య కార్యకర్తలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది.
ఫైజర్ టీకా రెండు డోసులు తీసుకున్న ఆరునెలల తర్వాత వారిలోని సార్స్- కోవ్-2 ప్రతినిరోధకాలు 80 శాతం మేర తగ్గిపోయాయని పరిశోధన కర్త డేవిడ్ కెనడే తెలిపారు. నర్సింగ్ హోంలో ఉంటున్న వారిలో 70 శాతం మందికి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేంత స్థాయిలో యాంటీబాడీలు ఉండడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్ ఉనికిలో ఉండడంతో బూస్టర్ డోసు అవసరమని ఈ అధ్యయనం చెబుతోందని కెనడే తెలిపారు.