Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం.. వర్షాలు కురవాలంటూ బాలికలను నగ్నంగా ఊరేగించిన వైనం!
- వర్షాలు కురవక గ్రామంలో కరవు పరిస్థితులు
- వరుణుడి కటాక్షం కోసం ఆరుగురు బాలికలను నగ్నంగా తిప్పిన వైనం
- వారి వెనక భజనలు చేస్తూ గ్రామస్థులు
- సీరియస్ అయిన బాలల హక్కుల పరిరక్షణ మండలి
మధ్యప్రదేశ్‌లో అత్యంత దారుణ ఘటన జరిగింది. వర్షాల కోసం వరుణ దేవుడి కటాక్షాన్ని కోరుతూ బాలికలను వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. దామే జిల్లాలోని బనియా గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్షాలు ముఖం చాటేయడంతో గ్రామంలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో వరుణ దేవుడి కరుణా కటాక్షాల కోసం గ్రామంలో ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. అందులో భాగంగానే బాలికలను నగ్నంగా ఊరేగించారు.
తొలుత ఓ కప్పను పట్టుకుని దానిని కర్రకు కట్టిన గ్రామస్థులు ఆ కర్రను నగ్నంగా ఉన్న బాలిక భుజాలపై పెట్టి వీధుల్లో తిప్పుతూ భజనలు చేశారు. మొత్తంగా ఆరుగురు బాలికలను ఇలా నగ్నంగా తిప్పినట్టు ఉన్న వీడియోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో బాలల హక్కుల పరిరక్షణ మండలి (ఎన్‌సీపీసీఆర్) దృష్టిలో పడడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.