Taliban: ఆఫ్ఘన్‌లో మీడియాతో పాటు పలువురు నేతలపై తాలిబన్ల ఆంక్షలు
- ప్రజలందరూ మేల్కొని తాలిబన్లపై పోరాడాలని అహ్మద్ పిలుపు
- ఆయన వ్యాఖ్యలను ప్రసారం చేయకూడదని తాలిబన్ల ఆదేశం
- కీలక నేతలు ప్రజలను కలవకుండా కూడా ఆంక్షలు
ఆఫ్ఘనిస్థాన్‌లోని పంజ్‌షీర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పంజ్‌షీర్‌లోని జాతీయ ప్రతిఘటన దళ నాయకుడు అహ్మద్ మసూద్ మాత్రం తాలిబన్ల ప్రకటనను ఖండిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
తుది శ్వాస విడిచేంతవరకు పంజ్‌షీర్ కోసం పోరాడుతూనే ఉంటానని, ప్రజలందరూ మేల్కొని తాలిబన్లపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, అహ్మద్ ఇచ్చిన సందేశం ప్రజల్లోకి వెళ్లకుండా ఆఫ్ఘన్ మీడియాపై తాలిబన్లు ఆంక్షలు పెట్టారు.
ఆయన వ్యాఖ్యలను ప్రసారం చేయకూడదని ఆదేశించారు. ఈ విషయాన్ని రష్యాకు చెందిన స్పుత్నిక్ మీడియా ఏజెన్సీ తెలిపింది. అంతేగాక, ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయి, ఆఫ్ఘన్ కీలక నేత, హెచ్‌సీఎన్ఆర్ మాజీ చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లా ఆ దేశ ప్రజలను కలవకుండా కూడా తాలిబన్లు ఆంక్షలు విధించారు.
నిన్న ఫేస్‌బుక్‌లో అహ్మద్ మసూద్ ఓ వీడియో పోస్ట్ చేసి ఆఫ్ఘన్లలో చైతన్యాన్ని నింపేలా వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ పౌరులు దేశం లోపల ఉన్నా, బయట ఉన్నా.. దేశ గౌరవం, స్వేచ్ఛ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజల్లో చైతన్యం రాకుండా చేసేందుకు తాలిబన్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం తాలిబన్లు ఆఫ్ఘన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఆప్ఘనిస్థాన్‌లోని పంజ్‌షీర్ ప్రావిన్స్ మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబన్లు ప్రకటనలు చేస్తుండగా, ఇప్పటికీ తాము పోరాడుతూనే ఉన్నామని మరోపక్క పంజ్‌షీర్ ప్రతిఘటన దళాలు చెబుతున్నాయి.