China: కిలోమీటర్ పొడవైన భారీ స్పేస్ షిప్ ను నిర్మించేందుకు చైనా నిర్ణయం

China Plans To Build The Largest Spaceship Ever In History
  • శాస్త్రవేత్తలతో సమావేశం
  • ఐదేళ్ల ప్రాజెక్ట్ పై అధ్యయనం చేయాలని ఆదేశం
  • రోదసీలో అమెరికాకు దీటుగా దూసుకెళ్తున్న చైనా
రోదసీలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిన డ్రాగన్ దేశం చైనా.. మరో భారీ ప్లాన్ కు సిద్ధమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పోటీగా ఇప్పటికే స్పేస్ స్టేషన్ తియాంగాంగ్ ఏర్పాటులో భాగంగా కోర్ మాడ్యూల్ తియాన్హేను చైనా అంతరిక్షంలోకి పంపింది.

అయితే, తాజాగా ఐఎస్ఎస్ కు పది రెట్లు పెద్దదిగా ఉండే వ్యోమ నౌక (స్పేస్ షిప్)ను రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దాదాపు కిలోమీటర్ పొడవుతో దానిని తయారు చేయనుంది. దీనిపై శాస్త్రవేత్తలతో నేషనల్ నేచురల్ సైన్స్ ఫౌండేషన్ సంస్థ సమావేశమైంది.

ఐదేళ్ల ఈ ప్రాజెక్ట్ లో సలహాలు, సూచనలను స్వీకరించింది. ప్రాజెక్ట్ పై అధ్యయనం చేయాల్సిందిగా సూచించింది. భవిష్యత్ లో సుదూర విశ్వంలోని వనరులను వాడుకోవడంలో, అంతరిక్ష రహస్యాలను తెలుసుకోవడంలో ఆ వ్యోమనౌక ఎంతో కీలకంగా ఉంటుందని చెబుతోంది. ఆర్థికంగా, సైనిక పరంగా ఇప్పటికే అమెరికాకు దీటుగా ఉన్న చైనా.. అంతరిక్ష రంగంలోనూ దూసుకెళ్లాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో ఆ దేశం ప్రయోగాల్లో వేగం పెంచింది.

రెండేళ్ల క్రితం చంద్రుడిపై ప్రయోగం చాంగీ 4ను చేపట్టింది. ‘చీకటి చంద్రుడి’వైపు విజయవంతంగా దిగిన మొదటి దేశంగా రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత గత ఏడాది జులైలో మార్స్ ప్రయోగం తియాన్వెన్ 1ను చేపట్టి సక్సెస్ అయింది. ఈ ఏడాది మేలో ఝరోంగ్ రోవర్ మార్స్ పై దిగింది. దీంతో అరుణ గ్రహంపై దిగిన రెండో దేశంగా చరిత్రను చైనా తన పేరిట లిఖించుకుంది.
China
Space Ship
ISS
USA
Tiangong
Tianhe
Tianwen
Zhurong
Change

More Telugu News