Taliban: ఆఫ్ఘన్ మాజీ గవర్నర్ సహా ఐదుగురికి భారత్‌లో ఆశ్రయం
- దౌత్య పాస్‌పోర్టులతో దేశంలోకి వచ్చిన ఐదుగురు
- విదేశాంగ శాఖకు అందిన సమాచారం
- వారిలో సమాంగన్ గవర్నర్ మహమ్మద్ దావూద్ కలాకని
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఐదుగురు అధికారులు భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. వీరందరికీ ఆఫ్ఘన్ దౌత్య పాస్‌పోర్టులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఆఫ్ఘనిస్థాన్‌లోని సమాంగన్ గవర్నర్ మహమ్మద్ దావూద్ కలాకని కూడా ఉన్నారట. వీరందరికీ భారత్‌లో ఆశ్రయం కల్పించినట్లు విదేశాంగ శాఖకు సమాచారం కూడా అందిందట. దుబాయ్ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వీరు చేరుకున్నారు.
ఇటీవల రంగీనా కర్గార్ అనే ఆఫ్ఘన్ నేతను ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రానివ్వలేదు. ఆమెకు వీసా లేదనే కారణంతో అధికారులు ఇలా చేశారు. అయితే డిప్లొమాటిక్ (దౌత్య సంబంధ) పాస్‌పోర్టులు ఉంటే భారత్‌లో 30 రోజులపాటు వీసా లేకుండా గడపొచ్చు. కానీ కార్గర్‌ను అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన విదేశాంగశాఖ ఆమెకు వెంటనే వీసా మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
అలాగే ఆమెకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆఫ్ఘన్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ఒక వైద్యుడు, ఆయన కుటుంబంతోపాటు సమాంగన్ మాజీ గవర్నర్ దావూద్ కలాకని కూడా వచ్చిన సమాచారాన్ని అధికారులు విదేశాంగ శాఖకు అందించారు. వీరందరికీ దౌత్య పాస్‌పోర్టులు ఉన్నాయని అధికారులు తెలిపారు.