Andhra Pradesh: వినాయక చవితి జరుపుకుంటేనే కరోనా కోరలు చాస్తుందా?: నారా లోకేశ్
- వైఎస్ జయంతి, మీ వివాహ వార్షిక వేడుకలకు కరోనా అడ్డుకాదా?
- కడపలో కనీస నిబంధనలు లేకుండా ఎమ్మెల్యే కార్యక్రమం
- ముఖ్య అతిథులుగా వైసీపీ నేతలు
- 'కోవిడియట్స్' అంటూ నారా లోకేశ్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని వినాయక చవితి ఉత్సవాలపై నిబంధనలు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వంపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ కీలక నేత నారా లోకేశ్.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడిన ఆయన.. ‘‘మీ నాన్న గారి జయంతి-వర్ధంతి, మీ వివాహ వార్షిక వేడుకలు, వైకాపా నాయకుల వ్యక్తిగత కార్యక్రమాలకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు ఒక్క వినాయక చవితికి మాత్రమే ఎందుకు అడ్డొచ్చాయి జగన్ గారూ?’’ అని ప్రశ్నించారు. అలాగే కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే నిర్వహించిన ఒక కార్యక్రమం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
‘‘కడప జిల్లా ప్రొద్దుటూరులో కనీస కోవిడ్ నిబంధనలు పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా హాజరయ్యారు. మీరంతా కోవిడియట్స్‌లా వ్యవహరిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.
‘‘సూపర్ స్పైడర్లుగా విచ్చలవిడిగా తిరుగుతుంటే కరోనా వ్యాపించదా? వినాయక చవితి జరుపుకుంటేనే కోవిడ్ కోరలు చాస్తుందా?’’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని లోకేశ్ ప్రశ్నించారు.