Karnataka: వినాయక చవితి రోజున మాంసం అమ్మకాలపై నిషేధం విధించిన కర్ణాటక
- బృహత్ బెంగళూరు మహానగర పాలికె నిర్ణయం
- వేడుకలు, నిమజ్జనం సమయంలో 20 మందికే అనుమతి
- 9 తర్వాత నైట్ కర్ఫ్యూ అమలు
వినాయక చవితి సందర్భంగా బెంగళూరు నగరంలో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 10న జంతువులను చంపడం, మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ బీబీఎంపీ జాయింట్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొన్నిరోజుల క్రితం వినాయక చవితి వేడుకలు, విగ్రహ నిమజ్జన ఉత్సవాల్లో 20 మందికి మించి పాల్గొనకూడదని కర్ణాటక ప్రభుత్వం నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే.
అలాగే రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి ఉండదని ప్రభుత్వం జారీచేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ స్పష్టంచేశాయి. కరోనాను కట్టడి చేసేందుకు పండుగ సమయంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుందని ఈ నిబంధనలు తేల్చిచెప్పాయి.
కేవలం మట్టి విగ్రహాలకే అనుమతులు ఉన్నాయని, అలాగే చవితి ఉత్సవాల్లో ఆహారం లేక ప్రసాదం పంపిణీకి కూడా అనుమతించబోమని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 2శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో ఎటువంటి కార్యక్రమాలూ జరగబోవని వెల్లడించింది.