NB Bharathi: రెండేళ్లుగా విధులకు హాజరు కాని మహిళా ఐపీఎస్.. కనిపించడం లేదంటూ పత్రికా ప్రకటనలు
- సెలవు పెట్టకుండా, చెప్పకుండా రెండేళ్లుగా విధులకు డుమ్మా
- నోటీసులకు, ఈ-మెయిల్స్‌కు స్పందన కరవు
- శాఖాపరమైన చర్యలు ప్రారంభించిన ఉన్నతాధికారులు
సెలవు తీసుకోకుండా, అధికారులకు సమాచారం ఇవ్వకుండా రెండేళ్లుగా విధులకు హాజరు కాని ఓ మహిళా ఐపీఎస్ అధికారి కనిపించడం లేదంటూ ఉన్నతాధికారులు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఒడిశాలోని కటక్ పోలీసు ప్రధాన కేంద్రం కథనం ప్రకారం.. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఐజీగా పనిచేస్తున్న భారతి రెండేళ్లుగా విధులకు హాజరు కావడం లేదు. అలాగని సెలవు కూడా తీసుకోలేదు. ఉన్నతాధికారులకు కనీసం మౌఖికంగానైనా చెప్పలేదు.
అలా రెండేళ్లుగా ఆమె విధులకు హాజరు కాకపోవడంతో మానవహక్కుల విభాగంలో బోల్డన్ని కేసులు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఇన్నాళ్లుగా ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసు ప్రధాన కార్యాలయం పలుమార్లు నోటీసులు పంపినా ఫలితం లేకుండా పోయింది. ఈ-మెయిల్స్‌కు కూడా స్పందనలేదు. దీంతో శాఖాపరమైన చర్యలు ప్రారంభించిన ఉన్నతాధికారులు నిన్న వివిధ పత్రికల్లో ఆమె కనిపించడం లేదంటూ ప్రకటనలు ఇచ్చారు.