Gummanur Jayaram: మద్యం ఏరులై పారుతోందంటే నేనేం చేయాలి.. తాగేవాడిని మనం మార్చలేం: ఏపీ మంత్రి జయరాం

AP Minister Jayaram sensational Comments on Liquor

  • నా దురదృష్టం కొద్దీ కర్ణాటక సరిహద్దు నా నియోజకవర్గానికి అరకిలోమీటరు దూరంలో ఉంది
  • అక్కడి నుంచి తెచ్చుకుని తాగుతున్నారు
  • తాగేందుకు సీఎం డబ్బులు ఇవ్వడం లేదంటున్నారు
  • నేనేమీ వీరప్పన్‌ను కాదు

మద్యం ఏరులై పారుతోందంటే తానేం చేయాలని, తాగేవాడిని మనం మార్చలేమని ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మంత్రి అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇసుక ట్రాక్టర్లను వదిలిపెట్టాలంటూ ఇటీవల ఎస్సైని బెదిరించిన మంత్రి ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఈ ఆరోపణలపై సీఎంకు వివరణ ఇచ్చేందుకే కలిశారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఈ విషయం సీఎంకు తెలియదన్నారు. అయినా, దందాగిరి చేసేందుకు వీరప్పన్‌లా ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేశానా? అని ఎదురు ప్రశ్నించారు.

మట్టి తోలుకున్నాక తిరిగొస్తున్న ఖాళీ ట్రాక్టర్లను ఎస్సై పట్టుకుంటే అవి రైతులవని, వదిలేయమని చెప్పిన మాట వాస్తవమేనని అన్నారు. తాను దురుసుగా ప్రవర్తిస్తే తప్పని అన్నారు. తానేమీ.. ‘‘ఏయ్ ఎస్సై, ఇసుక ట్రాక్టర్లను వదలండి’’ అని అంటే తప్పని, కానీ అలా అనలేదని అన్నారు. మద్యం గురించి మాట్లాడుతూ.. తాగేవాడిని తాగొద్దు, ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దని, కుటుంబాలు దెబ్బతింటాయని చెబితే ఎవరూ పట్టించుకోరని అన్నారు.  

అన్ని పథకాలకు డబ్బులు ఇస్తున్న సీఎం.. తాగేందుకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని అడుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. తాగేవాడిని మనం మార్చలేమని అన్నారు. తన దురదృష్టం కొద్దీ తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉందని, అరకిలోమీటరు దూరంలో ఉన్న అక్కడి నుంచి తెచ్చుకుని మరీ మద్యం తాగుతున్నారని, మద్యం ఏరులై పారుతోందంటే తానేం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అదే పనిగా వారిని కాచుకుని కూర్చోలేం కదా..? అని మంత్రి జయరాం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News