Telangana: తెలంగాణలో బయటపడిన అరుదైన విగ్రహం
- గోదావరిఖని మండలంలో బయటపడిన 800 ఏళ్లనాటి విగ్రహం
- తెలంగాణలో ఇదే అతి పెద్ద మూషిక విగ్రహం
- 3 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తున్న విగ్రహం
తెలంగాణలో అరుదైన మూషిక శిల్పం బయటపడింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం జనగాంలోని శిథిల శివాలయం వద్ద ఈ విగ్రహం బయల్పడింది. ఈ శివాలయం 800 ఏళ్ల నాటిది. ఈ విగ్రహానికి సంబంధించి పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ, కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో తుప్పలు, పొదలు తొలగిస్తుండగా గణపతి వాహనం వెలుగుచూసిందని చెప్పారు.
ఈ శిల్పం 3 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తు ఉందని శివనాగిరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇదే అతిపెద్ద మూషిక విగ్రహమని చెప్పారు. సర్వాభరణాలతో అలంకరించినట్టున్న ఈ శిల్పం గణపతిదేవుడి కాలానికి చెందినదని తెలిపారు. త్రికూటాలయంలో రెండు ఆలయాల్లో శివలింగాలు ఉన్నాయని... మూడో ఆలయం వినాయకుడిది అయిఉండొచ్చని చెప్పారు. గుప్తనిధుల కోసం ఈ విగ్రహాన్ని పెకిలించి ఉండొచ్చని తెలిపారు.