Andhra Pradesh: సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్మాలనుకోవడం సరికాదు: దర్శకుడు దేవ కట్టా
- సినిమా టికెట్లను ఆన్ లైన్లో విక్రయించనున్న ఏపీ ప్రభుత్వం
- సినిమాలు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినవన్న దేవ కట్టా
- డబ్బుల కోసం నిర్మాతలు ప్రభుత్వం ముందు నిల్చోవాలేమో అని విమర్శ
సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారా అమ్మబోతున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. రైల్వే టికెట్ల మాదిరి సినిమా టికెట్లను అమ్మేందుకు వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సినీ దర్శకుడు దేవ కట్టా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో నిర్మొహమాటంగా వెల్లడించారు.
రైల్వేస్ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కాబట్టి... రైల్వే టికెట్లను ప్రభుత్వం ఆన్ లైన్ లో విక్రయించడం సబబేనని దేవ కట్టా అన్నారు. కానీ సినిమాలు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవని.... ప్రైవేట్ వ్యక్తుల టికెట్లను ప్రభుత్వం అమ్మాలనుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం సరికాదని చెప్పారు. ఇకపై సినిమా తీసిన నిర్మాతలు ప్రైవేట్ కాంట్రాక్టర్ల మాదిరి డబ్బుల కోసం ప్రభుత్వం ముందు క్యూలో నిలుచోవాలేమోనని విమర్శించారు. అలాంటప్పుడు సినిమాల నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందా? అని ప్రశ్నించారు.