IIT Madras: దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగుల వెల్లడి
- రెండో స్థానంలో బెంగళూరు ఐఐఎస్సీ
- మూడో స్థానంలో ఐఐటీ బాంబే
- టాప్ టెన్ లో జేఎన్యూ, బీహెచ్యూ
ఐఐటీ మద్రాస్ మరోసారి తన గొప్పదనాన్ని చాటుకుంది. మన దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలలో ఐఐటీ మద్రాస్ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. 2021 సంవత్సరానికి గాను ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మద్రాస్ ఐఐటీ టాప్ ప్లేస్ ను నిలబెట్టుకుంది. ఈ ఘనతను వరుసగా మూడోసారి సాధించడం గమనార్హం. అన్ని విభాగాలతో పాటు, ఇంజినీరింగ్ కేటగిరిలో కూడా మద్రాస్ ఐఐటీ తొలిస్థానాన్ని సొంతం చేసుకుంది.
మరోవైపు ఈ ర్యాంకింగ్స్ లో బెంగళూరులోని ఐఐఎస్సీ రెండో స్థానంలో నిలవగా... ఐఐటీ బాంబే మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్ పూర్ నిలిచాయి. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ), బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్యూ)లకు కూడా టాప్ టెన్ లో స్థానం దక్కింది. ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు.