Venkaiah Naidu: భూలోకానికి వచ్చిన గణాధిపతిని తిరిగి కైలాసానికి సాగనంపడమే గణపతి నిమజ్జనం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- రేపు వినాయకచవితి
- శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్యనాయుడు
- గొప్ప ఉత్సవం అని వెల్లడి
- కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టీకరణ
రేపు వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ ప్రజలు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఏ విధమైన అడ్డంకులు రాకుండా ఉండేందుకు విఘ్నాధిపతిని పూజించడం సంప్రదాయం అని వివరించారు. జ్ఞానం, శ్రేయస్సు, సౌభాగ్యాలకు స్వరూపమైన వినాయకుడి జననాన్ని ఈ పండుగ సూచిస్తుందని తెలిపారు.
మానవ జనన మరణ జీవితచక్రాన్ని వినాయకచవితి వేడుకలు ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. భూలోకానికి వచ్చిన గణాధిపతిని తిరిగి కైలాసానికి పంపడమే గణపతి నిమజ్జనం అని భక్తుల నమ్మకం అని వెంకయ్యనాయుడు వివరించారు. కరోనా నేపథ్యంలో కచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని పండుగ జరుపుకోవాలని స్పష్టం చేశారు.