Donald Trump: బాక్సింగ్ వ్యాఖ్యాతగా ట్రంప్.. కుమారుడితో కలిసి కామెంటరీ

Trump to become commentator for the boxing match
  • ఇవాండర్ హోలీ ఫీల్డ్, విక్టర్ బెల్‌ఫోర్డ్ మధ్య మ్యాచ్
  • ఫ్లోరిడాలోని హాలీవుడ్ ఎరీనా వేదిక
  • చూడాలంటే 49.9 డాలర్లు చెల్లించాల్సిందే
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. అన్నింటిలోనూ కూడా 'నా రూటే సెపరేటు' అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తుంటారు. అదే రీతిలో ఇప్పుడు కామెంటేటర్ గా ఆయన మనకు దర్శనం ఇవ్వనున్నారు. కుమారుడు జూనియర్ ట్రంప్‌తో కలిసి ఒక బాక్సింగ్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

 హెవీవెయిట్ మాజీ ఛాంపియన్ ఇవాండర్ హోలీ ఫీల్డ్, యూఎఫ్‌సీ మాజీ ఛాంపియన్ విక్టర్ బెల్‌ఫోర్ట్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఫ్లోరిడాలోని హాలీవుడ్ ఎరీనా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనికోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

ఈ క్రమంలో తను వ్యాఖ్యాతగా ఉన్న ఈ మ్యాచ్‌ను ఎవరూ మిస్ కావొద్దంటూ ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. దీన్ని 'పే ఫర్ వ్యూ' విధానంలో FITE.TVలో ప్రసారం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ చూడాలంటే మాత్రం 49.9 డాలర్లు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. బాక్సింగ్ రంగంలో దిగ్గజాలు పోటీ పడే ఈ మ్యాచ్ కోసం అమెరికన్లు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

కాగా, బాక్సింగ్‌తో ట్రంప్‌కు బాగానే అనుబంధం ఉంది. గతంలో కొంతకాలం ఆయన కొన్ని బాక్సింగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చారు. వీటిలో చాలావరకూ అట్లాంటిక్ సిటీలో ఉన్న ట్రంప్ సొంత కేసినోలోనే జరిగేవి.
Donald Trump
Boxing
USA
Florida

More Telugu News