Congress: హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తానంటూనే షరతు పెట్టిన కొండా సురేఖ!
- హుజూరాబాద్ నుంచి సురేఖ పోటీ చేయబోతున్నట్టు ఇదివరకే వార్తలు
- వరంగల్ తూర్పు టికెట్ తమ కుటుంబానికి ఇస్తేనే అంటూ మెలిక
- కేసీఆర్ అసలు రంగు తెలిశాకే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చామన్న సురేఖ
ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. అయితే, అంతకంటే ముందు వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ మాత్రం తమ కుటుంబానికే కేటాయిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
హుజూరాబాద్ నుంచి సురేఖ పోటీ చేయబోతున్నారంటూ ఇటీవల వార్తలు షికారు చేశాయి. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆమెనే రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. సురేఖ తాజా వ్యాఖ్యలతో హుజూరాబాద్ నుంచి ఆమె పోటీ స్పష్టమని తేలిపోయింది. అయితే, తాజా మెలిక నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్ లక్ష్మీపురంలో నిన్న నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాలో మాట్లాడిన సురేఖ.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్‌లో తమను పావులా వాడుకున్నారని, కేసీఆర్ అసలు రంగు తెలిసిన తర్వాతే తాము ఆ పార్టీ నుంచి బయటకు వచ్చామని అన్నారు. సురేఖ భర్త కొండా మురళీ మాట్లాడుతూ.. వరంగల్ దళితులకు కూడా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వరంగల్ నుంచి దళితుల్ని లారీల్లో తరలించి హుజూరాబాద్‌లో నామినేషన్ వేయిస్తామని హెచ్చరించారు.