Emma Raducanu: యూఎస్ ఓపెన్ లో బ్రిటన్ టీనేజ్ అమ్మాయి ఎమ్మా సంచలనం
- ఫైనల్ చేరిన 18 ఏళ్ల ఎమ్మా రదుకాను
- సెమీస్ లో అద్భుత విజయం
- గ్రాండ్ స్లామ్ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి క్వాలిఫయర్
- 17 ఏళ్లలో ఫైనల్ చేరిన అత్యంత పిన్నవయస్కురాలు
యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో అతిపెద్ద సంచలనం నమోదైంది. బ్రిటన్ టీనేజి క్రీడాకారిణి ఎమ్మా రడుకాను ఫైనల్లోకి దూసుకెళ్లింది. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఓపెన్ చరిత్రలో ఒక క్వాలిఫయర్ మహిళల సింగిల్స్ ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. అంతేకాదు, గత 17 ఏళ్లలో గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన అత్యంత పిన్నవయస్కురాలు ఎమ్మానే.
18 ఏళ్ల ఎమ్మా నేడు జరిగిన సెమీఫైనల్లో 17వ సీడ్ గ్రీస్ క్రీడాకారిణి మారియా సకారీపై 6-1, 6-4తో అద్భుత విజయం సాధించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఎమ్మా యూఎస్ ఓపెన్ అంతిమ సమరంలో కెనడాకు చెందిన టీనేజ్ క్రీడాకారిణి లీలా ఫెర్నాండెజ్ తో తలపడనుంది.