Taliban: తాలిబన్ కేబినెట్ మంత్రుల్లో ఐదుగురు పాక్ మదర్సాలో చదువుకున్నవారే!
- పాకిస్థాన్‌తో తాలిబన్లకు బలమైన సంబంధాలు
- పెషావర్‌లోని ‘జిహాదీ యూనివర్సిటీ’లో చదువుకున్న ఐదుగురు ఆఫ్ఘన్ మంత్రులు
- సిరాజుద్దీన్ హక్కానీ తలపై రూ. 73 కోట్ల రివార్డు
ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలపై మరో విషయం వెలుగులోకి వచ్చింది. తాలిబన్లు ఏర్పాటు చేసిన మధ్యంతర ప్రభుత్వంలో చోటు సంపాదించుకున్న వారిలో ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నారు. అయితే, వీరంతా ఎక్కడ చదువుకున్నారన్న దానిపై తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం పాకిస్థాన్‌తో తాలిబన్లకు పెనవేసుకున్న బంధాన్ని మరోమారు రుజువుచేస్తోంది.
తాలిబన్ కేబినెట్‌లో చోటు సంపాదించిన వారిలో ముల్లా అబ్దుల్ లతీఫ్ మన్సూర్ (జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి), మౌలానా అబ్దుల్ బాకీ (ఉన్నత విద్యాశాఖ మంత్రి), నజీబుల్లా హక్కానీ (సమాచార, ప్రసారశాఖ మంత్రి), మౌలానా నూర్ మొహమ్మద్ సాకిబ్ (హజ్ మంత్రి), అబ్దుల్ హకీం సహ్రాయ్ (న్యాయ మంత్రి) తదితరులు ఉన్నారు. వీరందరూ పాకిస్థాన్, పెషావర్‌లోని హక్కానియా మదర్సాలో చదువుకున్నారు.
పాకిస్థాన్‌లోనే ప్రముఖ మదర్సాగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ సంప్రదాయ సైనిక శిక్షణ కూడా ఇస్తారు. జామియా దారుల్ ఉలూమ్ హక్కానియా అఖోడా ఖటక్ పేరుతో ఉన్న ఈ మదర్సాను ‘జిహాదీ యూనివర్సిటీ’ అని కూడా పిలుస్తుంటారు. తాలిబన్ నేత, ఆఫ్ఘనిస్థాన్ ప్రధాని అయిన ముల్లా మొహమ్మద్ హసన్ గ్లోబల్ టెర్రిరిస్ట్ జాబితాలోనూ ఉన్నాడు.
ఇక, అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిరాజుద్దీన్ హక్కానీ తలపై అమెరికా ప్రభుత్వం రూ. 73 కోట్ల రివార్డు ప్రకటించడం గమనార్హం.