USA: విద్యార్థులను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు.. ఇప్పటికే 1200 స్కూళ్లపై పంజా
- అమెరికాలో విద్యార్థుల వివరాలను కాజేస్తున్న హ్యాకర్లు
- మాల్ వేర్ సాయంతో స్కూళ్ల డేటా బేస్ నుంచి చోరీ
- సైబర్ దాడులు లేదంటే డార్క్ వెబ్‌లో అమ్మకం
ఇప్పటి వరకు ఐటీ కంపెనీలనే టార్గెట్ చేసిన హ్యాకర్లు ఇప్పుడు పిల్లలు చదువుకునే స్కూళ్లపై కూడా పడ్డారు. మాల్ వేర్ సాయంతో స్కూళ్ల డేటా బేస్ నుంచి విద్యార్థుల వివరాలను కాజేస్తున్నారు.
ఆపై సైబర్ దాడులు చేసి విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. అలా ఇవ్వలేని విద్యార్థుల వివరాలను డార్క్ వెబ్‌లో అమ్ముకుంటున్నారు. డార్క్ వెబ్‌లో పెట్టిన వివరాలతో అనేక రకాల నేరాలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే స్కూళ్లు అప్రమత్తంగా ఉండాలని అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ 'నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ' (ఎన్బీసీ) హెచ్చరించింది.
ఎన్బీసీ నివేదిక ప్రకారం.. అమెరికాలోని ఓ జిల్లా స్కూల్ విద్యార్థుల వివరాలను హ్యాకర్లు దొంగిలించారు. మాల్ వేర్ సాయంతో విద్యార్థుల పేర్లను, వ్యక్తిగత వివరాలను, సోషల్ సెక్యూరిటీ నెంబర్ లను తస్కరించారు. ఈ ఏడాది హ్యాకర్లు ఇలా 1200 స్కూళ్లను టార్గెట్ చేశారని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.
కాజేసిన వివరాలతో హ్యాకర్లు.. విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అలా డబ్బు ఇవ్వని విద్యార్థుల వివరాలను డార్క్ వెబ్‌లో అమ్ముకుంటున్నారని ఎన్బీసీ విచారణలో తేలింది. దీంతో స్కూళ్లు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థుల వివరాలు చోరీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.